Yanam: గవర్నర్‌ కిరణ్‌ బేడీ టూర్‌...యానాంలో ఉద్రిక్తత

  • భారీగా మోహరించిన పోలీసులు
  • ఏపీ నుంచి మూడు బెటాలియన్లు తరలింపు
  • బేడీ అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారన్న ఆరోపణ

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుదుచ్చేరి గవర్నర్‌ కిరణ్‌బేడీ ఈరోజు యానాంలో పర్యటించనుండడమే ఇందుకు కారణం. తమ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ముందుకు వెళ్లకుండా గవర్నర్‌ సైంధవ పాత్ర పోషిస్తున్నారని, అడిగిన మంత్రులను సీబీఐ పేరుతో బెదిరిస్తున్నారంటూ ప్రభుత్వం బేడీపై విరుచుకుపడుతోంది. పుదుచ్చేరి వైద్య, పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గవర్నర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆలస్యం కావడానికి, అమలు కాకపోవడానికి కిరణ్‌బేడీ తీరే కారణమని ఆయన ధ్వజమెత్తారు. ఇలా వ్యవహరిస్తే ఆమె యానాం పర్యటనను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బేడీ పర్యటన జరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

గవర్నర్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఓ వైపు బీజేపీ ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు అధికార పార్టీ హెచ్చరికలు హీట్‌ పుట్టిస్తున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఏపీ నుంచి మూడు బెటాలియన్ల పోలీసులను రప్పించామని ఎస్పీ రచనాసింగ్‌ తెలిపారు.

More Telugu News