Revanth Reddy: ఆ దొర అహంకారం కంటే మీ ప్రాణం ఎన్నో రెట్లు విలువైంది: ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యలపై రేవంత్ రెడ్డి

  • ఆత్మహత్మ చేసుకున్న ఆర్టీసీ కార్మికులకు నా అశ్రు నివాళి
  • ఒకే రోజు ఇద్దరికి ఇలా నివాళులర్పించడం బాధాకరం
  • కార్మికులు ధైర్యం కోల్పోవద్దు 

తెలంగాణలో ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానాల పట్ల ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పటించుకున్న డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు, హైదరాబాద్‌లో కండక్టర్‌ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి... సీఎం కేసీఆర్ ను 'దొర' అని పేర్కొంటూ విమర్శలు గుప్పించారు.

 'శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు జరగక ముందే.. రాణిగంజ్ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కండక్టర్ సురేంద్ర గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వారికి నా అశ్రు నివాళి. ఒకే రోజు ఇద్దరు ఉద్యోగులకి ఇలా నివాళులర్పించడం బాధాకరం. ధైర్యం కోల్పోకండి... ఆ దొర అహంకారం కంటే మీ ప్రాణం ఎన్నో రెట్లు విలువైంది' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించాలని, ఆయన మృతికి కారణమైన కేసీఆర్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కేసు నమోదు చేయాలని రేవంత్ మరో ట్వీట్ చేశారు.

More Telugu News