APSRTC: దసరా సీజన్ లో ఏపీఎస్ ఆర్టీసీకి బొనాంజా!

  • పండగ ఆదాయం రూ. 229 కోట్లు
  • గత సంవత్సరంతో పోలిస్తే రూ. 20 కోట్లు అధికం
  • 103 శాతానికి పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో

ఒకవైపు తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ, గడచిన దసరా పండగ సీజన్ లో ఏపీఎస్ ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని పొందింది. 2018తో పోలిస్తే, రూ. 20 కోట్లు అధికంగా రూ. 229 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. పండగ స్పెషల్ సర్వీసులు, రెగ్యులర్ బస్సులకు మంచి డిమాండ్ ఉండటంతో ఆక్యుపెన్సీ రేషియో 103 శాతానికి చేరింది.

గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 13 వరకూ మొత్తం 5,887 ప్రత్యేక సర్వీసులను నడిపించామని అధికారులు తెలిపారు. సీజన్ ఆరంభంలోనే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం, ఏపీఎస్ ఆర్టీకి లాభించింది. ఈ సీజన్ లో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడం, వారంతా తమ ప్రయాణానికి ఆంధ్రా బస్సులనే ఆశ్రయించడం కూడా ఆదాయం పెరగడానికి కారణమైంది. నిత్యమూ దాదాపు 40 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చే ఏపీ బస్సులు, పండగ సీజన్ లో రోజుకు 75 వేల మందిని గమ్యాలకు చేర్చాయి.

More Telugu News