TSRTC: ఆత్మహత్య చేసుకున్న మరో ఆర్టీసీ కార్మికుడు.. ఉద్రిక్తంగా మారుతున్న సమ్మె

  • ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న కార్మికుడు
  • రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా విధులు
  • పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్, రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సురేందర్‌గౌడ్ గత రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సురేందర్‌గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో సమ్మె ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అలాగే, నర్సంపేటలోనూ నిన్న సాయంత్రం ఓ డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.  

తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో పదో రోజుకు చేరుకుంది. ఆదివారం కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శనలు, ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి మృతితో ఖమ్మం పరిధిలో ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలు రెవెన్యూ సంఘాలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద ధర్నా నిర్వహించారు.

More Telugu News