Salman Khurshid: రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్న సల్మాన్ ఖుర్షీద్

  • బాధ్యతలకు దూరంగా రాహుల్ వెళ్లిపోయారన్న ఖుర్షీద్
  • సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు
  • రాహుల్ పార్టీ పగ్గాలు స్వీకరించాలంటూ తాజా వ్యాఖ్య

2019 లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలకు దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు పెను దుమరాన్నే రేపాయి. ఈ నేపథ్యంలో, సొంత పార్టీ నేతల నుంచే ఆయనకు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో, ఖుర్షీద్ యూటర్న్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ బాధ్యతలను స్వీకరించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. నిజాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని... పార్టీని మళ్లీ గాడిలో పెట్టే దిశగా అడుగులు వేయాలని చెప్పారు. తనను విమర్శిస్తున్నవారంతా మనసు లేని యంత్రాలు అంటూ మండిపడ్డారు.

సోషల్ మీడియా ద్వారా ఖుర్షీద్ స్పందిస్తూ, 'నా వ్యాఖ్యలు పార్టీని దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు కాంగ్రెస్ నేతలు అన్నారు. నా వ్యాఖ్యలు ఎందుకు బాధ కలిగించాయో అందరూ తెలుసుకోవాలి. విమర్శలు మానుకొని ధైర్యాన్ని ప్రదర్శించాలి. లేకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది' అని అన్నారు. రాహుల్ పార్టీ పగ్గాలను మళ్లీ స్వీకరించాలని... పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే కార్యక్రమాన్ని సోనియాగాంధీ కొనసాగించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేకపోయినా... ప్రజల అండతో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విలువల విషయంలో మనం రాజీ పడాల్సిన అవసరం లేదని అన్నారు.

More Telugu News