Rohit Sharma: మ్యాచ్ ను ఫ్రీగా చూడ్డానికి కాదు మీరు అక్కడున్నది: గవాస్కర్ 

  • పూణే టెస్టు సందర్భంగా రోహిత్ కాళ్లపై పడ్డ అభిమాని
  • పట్టుతప్పి కింద పడిపోయిన రోహిత్
  • సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డ గవాస్కర్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలో ప్రస్తుతం టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఉన్నంత క్రేజ్ ఎవరికీ లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో ఉన్నప్పుడు వారిని తాకేందుకు కొందరు వీరాభిమానులు పెద్ద ఫీట్లే చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూణేలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో నిన్న రోహిత్ అభిమాని మైదానంలోకి చొచ్చుకొచ్చి... అతని కాళ్లపై పడ్డాడు. ఈ సందర్భంగా రోహిత్ కూడా పట్టుతప్పి కింద పడ్డాడు. జరిగిన ఘటనను అందరూ సరదాగే తీసుకున్నారు. కానీ, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం సీరియస్ గా స్పందించారు.

స్టేడియంలోని సెక్యూరిటీ సిబ్బందిపై గవాస్కర్ మండిపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది ప్రేక్షకులను గమనించడం మానేసి, మ్యాచ్ చూస్తున్నారని... అందుకే ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. మన దేశంలో సంవత్సరాల నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. మ్యాచ్ ను ఫ్రీగా చూడటానికి కాదు సెక్యూరిటీ ఉన్నదంటూ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను నివారించడానికే సెక్యూరిటీ ఉందనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

More Telugu News