Crime News: అంతుపట్టని ఆత్మాహుతి.. విశాఖ సాగర్‌నగర్‌ ఘటన అంతా మిస్టరీ!

  • బాధితులది ఎవరికీ తెలియని జీవనం
  • అందరికీ దూరంగా ఒంటరి ప్రయాణం
  • విషాదంతో ముగిసిన జీవితం

విశాఖపట్టణంలోని సాగర్‌నగర్‌ కాలనీలో ముగ్గురి ఆత్మాహుతి ఘటన వెనుక కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇంటినే చితిమంటగా మార్చుకుని తండ్రీబిడ్డలు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నది వెల్లడైనా అందుకు కారణాలు మాత్రం తెలియడం లేదు. సాగర్‌నగర్‌ హెచ్‌ఐజీ-2 గృహ సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.

అర్ధరాత్రి 2.30 గంటల తర్వాత గ్యాస్‌ లీక్‌ చేసుకుని మంట అంటించుకుని వీరు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చల్లా లావణ్య (32) అక్కడికక్కడే చనిపోగా, సతీష్‌ చంద్ర (28) ఆసుపత్రికి తరలిస్తుండగా, వీరి తండ్రి చల్లా ఉమామహేశ్వరరావు(65) కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు.

కృష్ణా జిల్లాకు చెందిన ఉమహేశ్వరరావు ఆర్టీసీలో ఇంజనీరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. రెండేళ్ల క్రితం ఈ ఇంట్లో అద్దెకు దిగారు. అద్దెకు ఉంటున్నారన్న మాటేగాని చుట్టుపక్కల వారెవరితోనూ కనీసం పరిచయం కూడా లేదు. ఇంటికి రాకపోకలు కూడా ఉండేవి కావు. ఎప్పుడూ తలుపులు మూసుకుని ఇంట్లోనే ఉండేవారన్నది స్థానికుల కథనం.

సతీష్‌చంద్ర మానసిక రోగి అని, ఈ కారణంగా అర్ధరాత్రి వేళ అప్పుడప్పుడూ అరుపులు వినిపించేవని స్థానికులు చెబుతున్నారు. వీరి వ్యవహారం అంతుపట్టనిదిగా ఉండడంతో స్థానికుల సమాచారంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని ఇటీవలే తన ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా కోరాడు. నెల రోజుల్లో ఇల్లు ఖాళీ చేసేందుకు పోలీసుల సమక్షంలో ఉమామహేశ్వరరావు అంగీకరించారు.

ఇది జరిగిన తర్వాత ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలిలో దొరికిన లేఖలో ఎన్ని గంటలకు గ్యాస్‌ వదలాలి, ఆ తర్వాత ఎంత సమయానికి నిప్పు వెలిగించాలి వంటివి రాసి ఉండడంతో బాధితులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు అంచనాకు వచ్చారు. కానీ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నది అంతుపట్టడం లేదు.

మానసిక సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా, ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమామహేశ్వరరావు సోదరుడి కుమారుడు బెంగళూరులో ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతనికి సమాచారం అందించారు. అతను వస్తే తప్ప ఈ మిస్టరీ వీడిపోయే అవకాశం లేదు.

More Telugu News