IT raids: మేఘ కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు!

  • ఏక కాలంలో 30 చోట్ల దాడులు
  • పలు కీలక పత్రాలు స్వాధీనం
  • ఇవి సాధారణ తనిఖీలే : మేఘా ప్రతినిధి

పోలవరం మెయిన్‌ డ్యాం రివర్స్‌ టెండరింగ్‌లో ఏకైక బిడ్‌ వేసి కాంట్రాక్టు దక్కించుకున్న మేఘ ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ అధినేత మేఘ కృష్ణారెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ రోజు సోదాలు నిర్వహించారు. ఆదాయ పన్ను శాఖకు చెందిన ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌ ఈ సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల చేపట్టిన కాంట్రాక్టుల్లో వచ్చిన లాభాలకు సంబంధించిన లెక్కలు సరిగా చూపలేదన్న కారణంతో ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే వివరాలు వెల్లడించేందుకు ఐటీ అధికారులు నిరాకరించారు.

దేశ వ్యాప్తంగా 30 చోట్ల ఉన్న కంపెనీకి సంబంధించిన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బాలానగర్‌ కార్యాలయం, జూబ్లీ హిల్స్‌ చెక్‌పోస్టు కార్యాలయం, ఎంసీహెచ్‌ఆర్‌డీ సమీపంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

కాగా, ఐటీ సోదాలపై మేఘ సంస్థ కూడా స్పందించింది. రెండేళ్లకోసారి ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇలా తనిఖీలు చేయడం సర్వసాధారణమేనని, ఇప్పుడు కూడా జరుగుతున్నవి సాధారణ తనిఖీలేనని సంస్థ ప్రతినిధి తెలిపారు.

  • Loading...

More Telugu News