Pakistan: రెచ్చగొడుతున్న పాకిస్థాన్.. మరోసారి భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పాక్ డ్రోన్!

  • పాకిస్థాన్ డ్రోన్ ను పసిగట్టిన బీఎస్ఎఫ్ బలగాలు
  • టెర్రరిస్టులకు ఆయుధాలను పంపే ప్రయత్నం చేస్తున్న పాక్
  • ఎల్వోసీ వద్ద మళ్లీ ప్రారంభమైన టెర్రర్ క్యాంపులు

అంతర్జాతీయంగా మద్దతు కరువవుతున్నా పాకిస్థాన్ మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. ఏదో ఓ విధంగా భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తూనే ఉంది. తాజాగా నిన్న సాయంత్రం భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన డ్రోన్ ను బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో చక్కర్లు కొడుతున్న ఈ డ్రోన్ ను మన బలగాలు పసిగట్టాయి. పాక్ డ్రోన్ మన భూభాగంలోకి రావడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం... నిన్న సాయంత్రం 7.20 గంటలకు హజార్ సింగ్ వాలా గ్రామం, రాత్రి 10.10 గంటలకు తెండీవాలా గ్రామంపై డ్రోన్ చక్కర్లు కొట్టింది. గత సోమవారం రాత్రి కూడా సరిహద్దుకు అవతల పాక్ గగనతలంలో ఆ దేశానికి చెందిన పలు డ్రోన్లను బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. ఒక డ్రోన్ దాదాపు ఒక కిలోమీటర్ దూరం వరకు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చింది.

గత నెలలో 10 రోజుల వ్యవధిలో పాక్ డ్రోన్లు ఏకే47 తుపాకులు, గ్రెనేడ్లు, శాటిలైట్ ఫోన్లను మన భూభాగంలో జారవిడిచాయి. ఐదు కిలోల వరకు పేలోడ్ ను మోస్తూ వేగంగా కదులుతున్న డ్రోన్లను కూడా అధికారులు గుర్తించారు. మరోవైపు, పాకిస్థాన్ కు తిరిగి వెళ్లే క్రమంలో ఓ వరి చేనులో కూలిపోయిన డ్రోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం కూడా తెలిసిందే.

డ్రోన్ల ద్వారా టెర్రరిస్టులకు ఆయుధాలను పంపే యత్నాలను పాక్ చేస్తోంది. మరోవైపు ఎల్వోసీ వద్ద టెర్రర్ క్యాంపులను పాక్ సైన్యం మళ్లీ ప్రారంభించినట్టు భారత ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. ఈ క్యాంపుల్లో ఉన్న ఉగ్రవాదులను భారత్ లోకి పంపించేందుకు యత్నిస్తోంది. బాలాకోట్ టెర్రర్ క్యాంప్ పై మన వాయుసేన దాడుల తర్వాత... ఆ స్థావరం ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయిందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News