Tirumala: పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం... ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు

  • 9 రోజుల పాటు సాగిన బ్రహ్మోత్సవాలు
  • ఈ ఉదయం ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం
  • చక్రత్తాళ్వార్ కు పుష్కరిణిలో స్నానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఆగమోక్తంగా చక్రస్నాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి ఉభయ దేవేరులతో కూడిన మలయప్పస్వామి, చక్రత్తాళ్వార్‌ లను పల్లకిలో వరాహస్వామి ఆలయానికి చేర్చిన పూజారులు, ఉదయం 7 గంటల నుంచి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై చక్రత్తాళ్వార్‌ ను అర్చకులు పుష్కరిణిలో మూడు మునకలు వేయించారు.

ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ అధికారులు, ప్రముఖులతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సాయంత్రం బంగారు తిరుచ్చిపై శ్రీవారు విహరించనున్నారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అధికారికంగా ముగియనున్నాయి. కాగా, రేపటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులూ భక్తులు ఎంతో సహకరించారని తెలిపింది.

More Telugu News