APS RTC: ప్రయాణికులకు ఏపీఎస్‌ ఆర్టీసీ తీపి కబురు : 150 దసరా స్పెషల్స్‌

  • హైదరాబాద్‌ నుంచి అత్యధికంగా 110 బస్సులు
  • తెలంగాణ సమ్మె నేపథ్యంలో ఇది ఎంతో ఊరట
  • మిగిలిన సర్వీసులు బెంగళూరు, చెన్నై నుంచి

ఓ వైపు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో దసరా పండుగకు సొంతూర్లకు ఎలా చేరుకోవాలా? అని ఆలోచిస్తున్న ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా కోసం 150 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ తెలిపింది. ఇందులో అత్యధికంగా 110 బస్సులను హైదరాబాద్‌ నుంచి నడుపుతున్నట్లు ప్రకటించింది. మిగిలిన వాటిలో 30 సర్వీసులను బెంగళూరు నుంచి, మరో పది సర్వీసులను చెన్నై నుంచి నడుపుతామని ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపింది.

రద్దీకి అనుగుణంగా మరిన్ని అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. హైదరాబాద్‌ మహానగరంలో ఏపీ నుంచి వెళ్లి స్థిరపడిన వారు అత్యధికం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా వాసులు ఎక్కువ మంది ఉన్నారు. సాధారణంగా వీరంతా దసరా, సంక్రాంతి పండుగకు సొంతూరుకు రావాలని ప్లాన్‌ చేసుకుంటారు.

అయితే ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో అక్కడి నుంచి సర్వీసులు పూర్తిగా నిలిచి పోయాయి. దీంతో సొంతూర్లకు ఎలా చేరాలా? అని సతమతమవుతున్న వారికి ఇది తీపి కబురనే చెప్పాలి.

More Telugu News