India: 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా... వైజాగ్ పిచ్ పై మరింత స్పిన్!

  • ఐదో రోజున రెండు వికెట్లు తీసిన షమీ
  • డక్కవుట్ అయిన బవుమా
  • వర్షం పడుతుందంటున్న వాతావరణ శాఖ

విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయం దిశగా సాగుతోంది. ఒక వికెట్ నష్టానికి 11 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఈ ఉదయం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన సౌతాఫ్రికా జట్టు, మరో 41 పరుగులు జోడించి, టాప్ ఆర్డర్ లోని మూడు వికెట్లను కోల్పోయింది. 19 పరుగుల వద్ద డీ బ్రూన్ (10)ను అశ్విన్ అవుట్ చేయగా, ఆపై బవుమాను మహమ్మద్ షమీ డక్కౌట్ గా పెవీలియన్ చేర్చాడు. ఆ తరువాత షమీనే కీలకమైన డూ ప్లెసిస్ (13) వికెట్ ను కూడా దొరకబుచ్చుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే సౌతాఫ్రికా జట్టు 395 పరుగులు సాధించాలి. అది అసాధ్యమే. ఇక భారత జట్టుకు మరో ఆరు వికెట్లు కావాలి. విశాఖ పిచ్ తొలి నాలుగు రోజులతో పోలిస్తే, నేడు స్పిన్, సీమ్ కు మరింతగా అనుకూలిస్తుండటంతో భారత్ విజయం ఖాయమనే చెప్పవచ్చు. అయితే, ఆకాశం మేఘావృతమై ఉండటం, వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడమే భారత క్రికెట్ అభిమానులకు కాస్తంత ఆందోళన కలిగిస్తోంది.

More Telugu News