Telangana: హైదరాబాద్ టూ చిలుకూరు... చార్జ్ జస్ట్ రూ. 200!

  • ప్రయాణికులను దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్
  • రెండు కిలోమీటర్లకే రూ. 30 వసూలు
  • వాపోతున్న ప్రయాణికులు

చిలుకూరు... వీసాల బాలాజీగా పేరున్న ఈ దేవాలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ప్రతి నిత్యమూ ఈ దేవాలయం కిటకిటలాడుతుంది. ముఖ్యంగా శని, ఆదివారాలు. విదేశాలకు వెళ్లాలని భావించే వారి నుంచి, తమ కోరికలు తీర్చుకోవాలని కోరుకునే వారంతా చిలుకూరు బాలాజీ ఆలయానికి వస్తుంటారు. కోరికలు తీరిన వారు మొక్కు తీర్చుకునేందుకు వచ్చి బిజీగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఇక తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా చిలుకూరుకు వెళ్లే బస్సులు నిలిచిపోగా, ప్రైవేటు వాహనాలు భక్తులను దోచుకుంటున్నాయి. చిలుకూరుకు వెళ్లేందుకు తుఫాన్ వాహనంలో రూ. 200 వసూలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా చిలుకూరుకు ఆర్డినరీ ఆర్టీసీ బస్సులో రూ. 25 కూడా చార్జ్ ఉండదు. ఏసీ బస్ అయితే రూ. 60 ఉంటుంది. అంటే 300 శాతానికి పైగా అదనంగా వసూలు చేస్తున్నారనమాట. ఇక 7 సీటర్ ఆటోలను హైదరాబాద్ నగరంలోకి అనుమతించడంతో వారు కూడా దోపిడీకి దిగారు. రెండు కిలోమీటర్ల దూరానికే రూ. 30 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి.

ముఖ్యంగా మియాపూర్, మెహిదీపట్నం, కోటి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈ దోపిడీ అధికంగా కనిపిస్తోంది. మెహిదీపట్నం నుంచి చేవెళ్లకు రూ. 300 వరకూ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కోటి నుంచి ఎల్బీ నగర్ కు రూ. 150, సికింద్రాబాద్ నుంచి బోడుప్పల్ కు రూ. 100, మియాపూర్ నుంచి నగరంలోకి రూ. 120 వసూలు చేస్తున్నారు. వెంటనే ఆర్టీసీ సమస్యలు పరిష్కారమై సమ్మె విరమించకుంటే, రేపటి నుంచి మరిన్ని సమస్యలు తప్పవని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News