Narendra Modi: మోదీ ముందు 22 డిమాండ్లు ఉంచిన కేసీఆర్

  • నిన్న మోదీతో సమావేశమైన కేసీఆర్
  • దాదాపు 50 నిమిషాల పాటు చర్చ
  • రాష్ట్రానికి రావాల్సిన వాటిని వివరించిన ముఖ్యమంత్రి

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 50 నిమిషాల పాటు వీరిరువురూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 22 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి కేసీఆర్ అందించారు.

రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా రూ. 450 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అయితే ఇంకా ఒక ఏడాది నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ కోరారు. ఒక ఐఐఎంను మంజూరు చేయాలని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని విన్నవించారు. నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ. 19,205 కోట్లను విడుదల చేయాలని కోరారు.

కరీంనగర్ లో ఐఐఐటీ, బయ్యారంలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయాలని మోదీకి కేసీఆర్ విన్నవించారు. హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివృద్ధి చేయాలని కోరారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని విన్నవించారు. సెంట్రల్ యూనివర్శిటీ తరహాలో వరంగల్లో గిరిజన యూనివర్శిటీని కేంద్ర నిధులతో ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్ కు రూ. 1000 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పలు విన్నపాలతో కూడిన లేఖను ప్రధానికి ముఖ్యమంత్రి అందించారు.

More Telugu News