BJP: మోదీ తీరు చూస్తుంటే మమ్మల్ని ప్రజలు చితక్కొట్టడం ఖాయమనిపిస్తోంది: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే

  • బీహార్ వరదలపై ఆరా తీసిన మోదీ
  • కర్ణాటక వరదల సమయంలో పట్టించుకోని ప్రధాని
  • ప్రజల తర్వాతే పార్టీ అని తెగేసి చెప్పిన బసనగౌడ
వరదలతో అల్లాడుతున్న బీహార్‌కు అండగా ఉంటామంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ట్వీట్‌పై కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీహార్ వరదలపై ఆరా తీసిన మోదీ కర్ణాటక గురించి ఒక్క మాటైనా మాట్లాడకపోవడమే ఆయన అసహనానికి కారణం. 25 మంది ఎంపీలను ఇచ్చిన కర్ణాటకను మోదీ పట్టించుకోకపోవడం దారుణమన్న బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్.. ఇలాగైతే కష్టమని చెప్పేశారు. కర్ణాటకను పట్టించుకోకపోతే దక్షిణ భారతదేశంలో పార్టీ పట్టుకోల్పోతుందని బాహాటంగానే చెప్పేశారు.

ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని, ప్రజల మనోభావాలు, భావోద్వేగాలకు సంబంధించినదని బసనగౌడ పేర్కొన్నారు. బీహార్ వరదలపై ట్వీట్ చేసిన మోదీ కర్ణాటక గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లడం కష్టమన్నారు. ప్రజలకు తమ ముఖాలు ఎలా చూపించాలని ప్రశ్నించారు. కర్ణాటకలో ఎన్నికలు లేవనే రాష్ట్రం గురించి మోదీ పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోందన్నారు. ఏది ఏమైనా ముందు ప్రజలు, ఆ తర్వాత రాష్ట్రం, అటు తర్వాతే పార్టీ అని తెగేసి చెప్పారు. కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితి గురించి పార్టీ ఎంపీలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని, లేదంటే తాము ఎమ్మెల్యేలమని, ఎంపీలమని చెబితే ప్రజలు చితక్కొట్టడం ఖాయమని బసనగౌడ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆగస్టులో కర్ణాటకను వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో మోదీ నుంచి ఒక్క ట్వీట్ కూడా రాలేదు. కానీ బీహార్ వరదలపై ట్వీట్ చేసిన మోదీ, ఆ రాష్ట్రానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, బీహార్ వరదల్లో ఇప్పటి వరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
BJP
Narendra Modi
Karnataka
bihar
tweet
basanagowda

More Telugu News