Jagan: గ్రామ సచివాలయ ఉద్యోగులు కుల, మత, పార్టీలకు అతీతంగా పని చేయాలి!: ఉద్యోగులకు జగన్ సూచన

  • గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతే
  • నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీదే
  • గాంధీ కలలు కన్న పాలనను తీసుకొస్తాం

ఏపీలో నేడు గ్రామ సచివాలయ వ్యవస్థ ఆవిర్భవించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగరాదని చెప్పారు. మీ పార్టీ ఏదని అడిగి గతంలో జన్మభూమి కమిటీలు పని చేసేవని... ఎక్కడ చూసినా అవినీతి ఉండేదని తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు కుల, మత, పార్టీలకు అతీతంగా పని చేయాలని... మనమే అధికారంలోకి వచ్చేలా ప్రజలకు సేవలందించాలని చెప్పారు.

నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని జగన్ తెలిపారు. డిసెంబర్ నాటికి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనవరి 1 నుంచి అర్హులైన అందరికీ రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులను అందజేస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. అన్నింటినీ డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. ప్రతి రైతుకు రూ. 12,500 అందించి ఆదుకుంటామని చెప్పారు. గాంధీ కలలు కన్న పాలనను తీసుకొస్తామని తెలిపారు.

More Telugu News