High Court: నవయుగకు ఎదురు దెబ్బ.. బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు జీఓ నిలిపివేతకు హైకోర్టు నో!

  • టెండరు నిర్వహించుకోవచ్చని ఏపీ సర్కారుకు గ్రీన్‌సిగ్నల్‌
  • బిడ్‌ ఖరారు చేయవద్దని సూచన
  • పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం
బందరు పోర్టు ఒప్పందాన్ని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 66ను నిలిపి వేయాలని కోరుతూ గతంలో ఈ కాంట్రాక్టు దక్కించుకున్న నవయుగ సంస్థ హైకోర్టులో దావా వేయగా, అక్కడ సదరు సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము ఏ రకంగాను జోక్యం చేసుకోలేమని, ప్రాజెక్టు పనులకు సంబంధించిన వ్యవహారాలను ప్రభుత్వం యథావిధిగా కొనసాగించుకోవచ్చని జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. టెండరు ప్రక్రియ నిర్వహించుకోవచ్చని, బిడ్‌ మాత్రం ఖరారు చేయవద్దని తెలిపింది. ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిన తర్వాత పూర్తి వాదనలు వింటామని తెలిపింది.

రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో భాగంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల బాధ్యత నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వైసీపీ ప్రభుత్వం ఆగస్టు 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నవయుగ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఎటువంటి నోటీసులుగాని, వివరణగాని కోరకుండా పనులను ఏకపక్షంగా రద్దు చేశారని ఆ పిటిషన్ లో పేర్కొంది.

వాస్తవానికి అడ్డంకులను తొలగించి పనులు సజావుగా సాగేందుకు అవసరమైన 5,324 ఎకరాల భూమిని అప్పగించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లే తాము పనులు ప్రారంభించలేదని సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. పైగా తమకు అప్పగించిన భూముల్లో 932 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని, అప్పగించిన 412 ఎకరాల్లో సైతం కనీస సౌకర్యాలు కల్పించలేదని వాదించింది.

నిబంధనలు తామేమీ ఉల్లంఘించలేదని, సొంత తప్పిదాలను ప్రభుత్వం తమపైకి నెడుతోందని, అందువల్ల రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేయాలంటూ సంస్థ హైకోర్టును కోరింది. ఈ పిటిషన్‌ పరిశీలించిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
High Court
bandaru port
machilipatnam
navayuga
pitision suspend

More Telugu News