manohar lal khattar: హరియాణాకు ముఖ్యమంత్రి.. తిరిగేందుకు కారు కూడా లేదట!

  • ఈ నెల 21న హరియాణాలో శాసనసభ ఎన్నికలు
  • నామినేషన్ దాఖలు చేసిన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
  • మొత్తం ఆస్తి విలువను రూ.1.27 కోట్లుగా పేర్కొన్న సీఎం
హరియాణాలో ఈ నెల 21న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సమయం దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్షాల అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు క్యూ కడుతున్నారు. ఈ ఎన్నికల్లో హరియాణా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కర్నాల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. 65 ఏళ్ల ఈ బీజేపీ సీనియర్ నేత నిన్న తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన పత్రాల్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

రిటర్నింగ్ అధికారికి ఖట్టర్ సమర్పించిన నామినేషన్ పత్రాల ప్రకారం.. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.1.27 కోట్లు. అందులో రూ.94 లక్షలు చరాస్తులు కాగా, 33 లక్షలు స్థిరాస్తులు. 2014లో ఖట్టర్ తన చరాస్తుల విలువను రూ. 8,29,952గా చూపగా ఐదేళ్లలో వాటి విలువ రూ.94,00,985కు పెరిగింది.

ఇక తన స్వగ్రామమైన రోహ్‌తక్ జిల్లాలోని బినాయినిలో రూ.30 లక్షల విలువ చేసే సాగు భూమి, 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉన్నట్టు పత్రాల్లో పేర్కొన్నారు. దాని విలువను రూ. 3 లక్షలుగా చూపారు. తనపై ఎటువంటి కేసులూ లేవని పేర్కొన్న ఖట్టర్.. తిరిగేందుకు సొంత కారు కూడా లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

గ్రాడ్యుయేషన్ చదువుకున్న తన వద్ద ప్రస్తుతం రూ.15 వేల నగదు మాత్రమే ఉందని పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటి అద్దె, విద్యుత్, తాగునీరు, టెలిఫోన్ చార్జీలన్నీ చెల్లించేశానని, ఎటువంటి బకాయిలు లేవని ఖట్టర్ తన అఫిడవిట్‌లో తెలిపారు.
manohar lal khattar
Haryana
assembly elections

More Telugu News