KCR: కేసీఆర్ కు తెలియని బ్రాండ్లా... జగన్ తో మాట్లాడింది మద్యం బ్రాండ్ల గురించే!: పంచుమర్తి అనురాధ విసుర్లు

  • ఏపీలో కొత్త మద్యం విధానం అమలు
  • మీడియా సమావేశంలో స్పందించిన పంచుమర్తి
  • జగన్ సర్కారుపై విమర్శల జడివాన

ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ మీడియా సమావేశంలో విమర్శనాస్త్రాలు సంధించారు. రూ.50, రూ.60 ఉన్న మద్యం సీసాలపై రూ.250 పెంచితే రాష్ట్రంలో మద్యం మాఫియా పెరగదా అని నిలదీశారు. ఓ బాటిల్ పై ఏకంగా రూ.250 పెంచడం అంటే నిరుపేదలను దోపిడీ చేయడమేనని అన్నారు. నిషేధం ముసుగులో మద్యం తయారీదారులకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

"ప్రజలు ఏ బ్రాండు తాగాలో జగన్ చెబుతారంట! ఏ బ్రాండు తాగాలో మీకెందుకు? ఉద్యోగ కల్పన చేయాల్సిన ముఖ్యమంత్రి బ్రాండ్లు నిర్ణయించడమేంటి? ఆ బ్రాండ్ల ముసుగులో రూ.2000 కోట్లు దోచేస్తారా? మొన్న కేసీఆర్, జగన్ గంటల కొద్దీ చర్చించింది బయటపెట్టలేదు, కానీ ఇప్పుడర్థమవుతోంది ఇద్దరూ మాట్లాడుకుంది బ్రాండ్ల గురించేనని. ఎందుకంటే కేసీఆర్ కు ఏ బ్రాండైనా తెలుసు. ఏ బ్రాండ్ కు ఎంతొస్తుంది? ఏ బ్రాండ్ ఏ కంపెనీ అమ్ముతుంది? మనకొచ్చే లాభమెంత? మన జేబులో ఎంత వేసుకోవచ్చు?... ఇవీ కేసీఆర్, జగన్ మధ్య జరిగిన చర్చలు" అంటూ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో 20 శాతం మద్యనిషేధం చేశామని చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు, ఎక్కడ మద్య నిషేధం అమలు చేశారో చెప్పాలని పంచుమర్తి నిలదీశారు. ఎన్నికల వేళ ఫైవ్ స్టార్ హోటళ్లకే మద్యం అమ్మకాలు పరిమితం చేస్తామని చెప్పి ఇప్పుడు చేస్తున్నదేమిటి అని ప్రశ్నించారు. మద్యనిషేధం, ప్రొహిబిషన్ అంటూ గొప్ప గొప్ప మాటలు చెబుతూ, దాని ముసుగులో జే-ట్యాక్స్ అనేది మరొకటి కలిపారని ఆరోపించారు. రూ.2000 కోట్లు దోచుకునేందుకు తెరలేపారని, జీఎస్టీతో కలిసి 6 శాతం ఉంటే, దానికి జే-ట్యాక్స్ కూడా కలిపి రూ.10 మద్యం బాటిల్ ను రూ.250కు పెంచేసి రోజువారీ కూలీలను మరింత దోచుకుంటుంటే దీన్ని మద్యపానం నిషేధం అంటారా? అని నిప్పులు చెరిగారు.

More Telugu News