Chandrababu: చంద్రబాబుకు మతిమరపొచ్చిందేమో!: ఎమ్మెల్యే రోజా విసుర్లు

  • బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసింది జగన్ ప్రభుత్వం
  • టీడీపీ హయాంలో రద్దు చేశారనడం కరెక్టు కాదు
  • బాబుని ఏ పిచ్చాసుపత్రిలో చేర్చాలో ప్రజలే ఆలోచించాలి
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే తమ హయాంలోనే వాటిని రద్దు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడటం కరెక్టు కాదని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చిత్తూరు జిల్లా నగరిలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారో లేక ఆయనకు మతిమరుపు వచ్చిందో తెలియడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 ఏపీలో పిచ్చి తుగ్లక్ పాలన నడుస్తోందని పిచ్చి పిచ్చి మాటలు ఆయన మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో మాట ఇచ్చిన ప్రకారమే ఐదు జీవోలను రద్దు చేశారని అన్నారు. ఈ జీవోలను రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు, తమ హయాంలోనే చేశామని చెబుతున్న చంద్రబాబునాయుడుని ఏ పిచ్చాసుపత్రిలో జాయిన్ చెయ్యాలో ప్రజలే ఓసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని విమర్శించారు. చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేస్తున్న పిచ్చి వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పకపోవడంతో వీళ్లకు పిచ్చెక్కి పోతున్నట్టు ఉందని అన్నారు.
Chandrababu
Telugudesam
YSRCP
mla
Roja

More Telugu News