Telangana: పండుగ వేళ తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. 1697 ప్రత్యేక బస్సులు సిద్ధం!

  • రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం
  • ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి పండుగ ప్రత్యేక బస్సులు
  • అక్టోబరు 4 నుంచి శివారు ప్రాంతాల నుంచి కూడా..

రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పండుగలకు హైదరాబాద్ నగరం నుంచి ఊర్లకు క్యూకట్టే వారి సంఖ్య పెరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ముందే మేలుకొంది. ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. ఈ రెండు స్టేషన్లలో నేటి నుంచి దసరా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది. అక్టోబరు 3 వరకు స్పెషల్ సర్వీసులు నడుస్తాయని పేర్కొంది. పండుగ రద్దీని తట్టుకునేందుకు మొత్తం 1,697 ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ప్రత్యేక బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్న అధికారులు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే, ప్రయాణికుల రద్దీ, ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని అక్టోబరు 4 నుంచి శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రత్యేక బస్సుల వివరాల కోసం మరిన్ని వివరాలు కావాలనుకునేవారు ఎంజీబీఎస్‌ 83309 33419, 83309 33537లలో, జేబీఎస్‌ పరిధిలో  040-27802203ను సంప్రదించవచ్చు.

More Telugu News