Hyderabad: తన అంత్యక్రియలకు డబ్బులిచ్చి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు!

  • ఓ క్యాబ్‌ డ్రైవర్‌ విషాదాంతం
  • అనాథ అయినా ఆత్మవిశ్వాసంతో పైకి
  • జీవితంపై విరక్తితో బలవన్మరణం

ఊహ తెలిశాక అతని జీవితం అనాథాశ్రమంలో ప్రారంభమైంది. ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దగా చదువుకోక పోయినా ఆత్మవిశ్వాసంతో పైకి ఎదిగాడు. క్యాబ్‌ డ్రైవర్‌గా స్థిరపడి బతుకు దెరువు ఏర్పర్చుకున్నాడు. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, తాను అనాథ అయినా తన శవం అనాథగా మిగిలిపోకూడదని ఓ స్వచ్ఛంద సంస్థకు అంతిమ సంస్కారానికి ముందుగానే డబ్బులిచ్చి మరీ చనిపోయాడు. చూసే వారికి, వినే వారికి కంటనీరు తెప్పించిన ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌కు చెందిన విజయ్‌ అనే క్యాబ్‌ డ్రైవర్‌ మంగళవారం రాత్రి పంజాగుట్ట వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జరగడానికి ముందే నగరంలోని ‘సర్వ్‌నీడి సంస్థ’కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. పట్టాలపై  అనాథ శవం ఒకటి ఉందని, అంత్యక్రియలు నిర్వహించాలన్నది ఆ కాల్‌ సమాచారం.

సంస్థ ప్రతినిధులు పంజాగుట్ట వెళ్లి శవాన్ని స్వాధీనం చేసుకుని అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో మృతుని ముఖం చూసి షాకయ్యారు. కొన్ని గంటల ముందు అనాథల అంతిమ సంస్కారానికి డబ్బులు ఇచ్చిన వ్యక్తే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తించి ఆశ్చర్యపోయారు. చనిపోయే ముందు రాసిన సూసైడ్‌ లేఖలో కూడా విజయ్‌ ఇదే విషయాన్ని పేర్కొన్నాడు.

'నా శవాన్ని సర్వ్‌నీడి సంస్థకు అప్పగించండి. నా అంత్యక్రియల కోసం వారికి ముందుగానే డబ్బు చెల్లించాను. ఒక అనాథగా ఇలాంటి చావు కోరుకోవడం నాకు బాధగానే ఉంది. కానీ తప్పలేదు’ అంటూ లేఖలో పేర్కొనడంతో చదివిన వారంతా కంటనీరు పెట్టారు.

More Telugu News