ajmer central jail: జైల్లో భలే మంచి లాభసాటి బేరం...సిగరెట్‌ ప్యాకెట్‌ రూ.15 వేలు

  • రాజస్థాన్‌లోని అజ్మేర్‌ కేంద్ర కారాగారంలో వ్యాపారం
  • ధనిక ఖైదీలకు వీఐపీ సౌకర్యాలు
  • ఒక్కో అధికారి ఆదాయం నెలకు రూ.25 లక్షల పైమాటే

జైలు అంటే నాలుగు గోడల మధ్య వ్యవహారం. అక్కడ ఏం జరిగినా జైలు అధికారులు, సిబ్బందికి తప్ప మూడో కంటికి తెలియడం కష్టం. అటువంటి చోట 'ఏ ఆగడాలకు తెరతీస్తే ఏమవుతుంది, పైగా లాభసాటి వ్యాపారం’ అనుకున్నారో ఏమో అక్కడి అధికారులు. ఏకంగా సంపన్న ఖైదీల అవసరాలు తీరుస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇక్కడ సిగరెట్‌ ప్యాకెట్‌ రూ.12 వేల నుంచి  రూ.15 వేలు పలుకుతుందంటే వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో ప్రత్యేకంగా చెప్పాలా.

వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌ రాష్ట్రం అజ్మీర్‌లో కేంద్ర కారాగారం ఉంది. ఈ జైల్లోని బ్యారెక్‌ ఒకటి నుంచి 15 వరకు గదుల్లో వీఐపీ ఖైదీలున్నారు. ఈ పదిహేను గదుల్లోని ఖైదీలు ప్రస్తుతం జైలు అధికారులు, సిబ్బందికి కాసులు కురిపించే కామధేనువుల్లా మారారు. ఈ ఖైదీలకు పరిశుభ్రమైన గదులు, ప్రత్యేక ఆహారం, ఉతికిన దుస్తులు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందుకుగాను వీరి నుంచి నెలకు రూ.8 లక్షలు వసూలు చేస్తున్నారు.

ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు. ఖైదీలకు అవసరమైన సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను భారీ మొత్తం వసూలు చేసి సరఫరా చేస్తున్నారు. ఒక సిగరెట్‌ ప్యాకెట్టుకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక, పొగాకు ఉత్పత్తుల కోసం రూ.300 నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారాల కారణంగా ఒక్కో అధికారి రూ.25 లక్షల వరకు సంపాదిస్తున్నారని తేలింది.

దీనిపై ఆరోపణలు గుప్పుమనడంతో దర్యాప్తు మొదలుపెట్టిన ఏసీబీ అధికారులు ఈ విషయాలు గుర్తించి నోరెళ్లబెట్టారు. బాధ్యులుగా భావిస్తున్న 12 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఓ ఏసీబీ అధికారి మాట్లాడుతూ ‘ ఈ వ్యవహారాలకు సంబంధించి జులైలోనే సమాచారం అందింది. ఈ అవినీతి ఇప్పటిది కాదు. ఏళ్లుగా సాగుతోంది’ అని చెప్పడం గమనార్హం.

More Telugu News