తాగివచ్చి నిత్యం వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

24-09-2019 Tue 09:33
  • తమ్ముడితో కలిసి ఓ భార్య ఘాతుకం
  • చంపాక నోట్లో యాసిడ్‌పోసి ఆత్మహత్యగా చిత్రీకరణ
  • పోలీసుల విచారణలో బయటపడిన నిజం
మద్యానికి బానిసై నిత్యం తాగివచ్చి వేధిస్తున్న భర్తను వదిలించుకునేందుకు ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తమ్ముడితో కలిసి భర్తను ఉరిబిగించి చంపేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అతని నోట్లో యాసిడ్‌ పోసింది. పోలీసుల కథనం మేరకు.... హైదరాబాదులోని జీడిమెట్ల, గాజుల రామారం నెహ్రూనగర్‌కు చెందిన నర్సింహులు (43) భార్య సునీత (40)తో కలసి రాయదుర్గంకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. మద్యానికి బానిసైన నర్సింహులు నిత్యం తాగివచ్చి భార్యను కొడుతుండేవాడు. భర్త తీరును తమ్ముడు సద్దు శ్రీనివాస్‌ (34)కు చెప్పి సునీత నిత్యం వాపోయేది.

రోజురోజుకీ భర్త వేధింపులు ఎక్కువ కావడంతో నర్సింహులు హత్యకు అక్కా, తమ్ముడు పథకం వేశారు. ఈనెల 19వ తేదీ రాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన భర్త తలపై సునీత కర్రతో బలంగా కొట్టింది. కిందపడిన అతని మెడకు నైలాన్‌ తాడుబిగించి హత్య చేశారు. అనంతరం నర్సింహులు నోట్లో యాసిడ్‌ పోశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది.

తన భర్త గత కొంతకాలంగా దగ్గు, ఆస్తమాతో బాధపడుతున్నాడని, బాధను తట్టుకోలేక యాసిడ్‌తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కట్టు కథ వినిపించింది. మొదట అది నిజమేననుకున్న పోలీసులు, నర్సింహులు శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి, విచారణ జరపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంత అక్కాతమ్ముళ్లను అరెస్టు చేశారు.