Tamil Nadu: నన్ను ఆత్మహత్య చేసుకోమని బలవంతం చేస్తున్నారు: అధ్యాపకురాలి ఆవేదన

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అధ్యాపకురాలి వీడియో
  • తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని కన్నీళ్లు
  • విచారణ కోసం కమిటీని నియమించిన యాజమాన్యం

చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాల అధ్యాపకురాలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో కలకలం రేపుతోంది. తనను ఆత్మహత్య చేసుకోమంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సహా తోటి ఉద్యోగులు వేధిస్తున్నారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. దుర్భాషలాడుతూ వేధించడమే కాకుండా శారీరకంగానూ హింసిస్తున్నారని ఆరోపించారు. వీడియోలో ఆమె పేర్కొన్న దాని ప్రకారం..

తాను గత 18 ఏళ్లుగా కళాశాలలో పనిచేస్తూ క్యాంపస్‌లోనే ఉంటున్నట్టు ఆమె పేర్కొన్నారు. తనను గదిలో పెట్టి తాళం వేసి నీరు, ఆహారం అందించకుండా హింసించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రోజు స్టాఫ్‌ రూములో విద్యార్థుల ముందు సీనియర్ అధ్యాపకులు తనను బలంగా నెట్టివేశారని గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల ఎదుటే ఈ ఘటన జరగడంతో మానసికంగా కుంగిపోయానని తెలిపారు. ఆత్మహత్య చేసుకోవాలంటూ తనను ఓసారి గదిలో నిర్బంధించారని, రెండువారాల పాటు అన్నపానీయాలు రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం కావాలని, తనను కాపాడాలని ఆమె అభ్యర్థించారు.

బాధిత అధ్యాపకురాలి వీడియో వైరల్ కావడంతో ఠాగూర్ వైద్య కళాశాల యాజమాన్యం స్పందించింది. ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఆమె గత ఏడాదిన్నరగా క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నట్టు తెలిపింది. ఈ ఘటనపై విచారణకు ఓ కమిటీని నియమించినట్టు కళాశాల డీన్ తెలిపారు.

More Telugu News