Syeraa: సైరా సెట్స్ పై నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహార శైలి గురించి చెప్పిన జగపతిబాబు

  • హైదరాబాద్ లో సైరా ప్రీరిలీజ్ వేడుక
  • హాజరైన సినీ ప్రముఖులు
  • వేదికపై జగపతిబాబు స్పీచ్

మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషించిన సైరా చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగపతిబాబు కూడా వేదికపై మాట్లాడారు. సైరాలో కీలకపాత్ర పోషించిన జగపతిబాబు మైక్ అందుకుని మాట్లాడుతూ, స్టేజ్ పై మెగాస్టార్, పవర్ స్టార్, గిగా స్టార్లు చాలామంది ఉన్నారని, తాను ఎక్కువగా మాట్లాడకూడదని చమత్కరించారు.

గాంధీ పుట్టినరోజు నాడు ఈ చిత్రం రిలీజవుతోందని, ఆ రోజున పుట్టే సైరా బేబీని మీరే పెంచి, పోషించి, పాలించాలని అభిమానులను కోరారు. ఇక సైరా చిత్రానికి నిర్మాత రామ్ చరణ్ గురించి చెబుతూ, తాను ఓ రోజు షూటింగ్ కు వెళ్లలేక మరునాడు సెట్స్ మీదకు వెళ్లానని, అయితే సెట్స్ మీద అందరి ముఖాల్లో ఆనందం చూసి ఆశ్చర్యం వేసిందని తెలిపారు.

ఏంటని అక్కడున్న వాళ్లను అడిగితే, రామ్ చరణ్ వచ్చాడని జవాబిచ్చారని వివరించారు. కారణం ఏంటంటే, రామ్ చరణ్ సెట్స్ మీద ప్రతి ఒక్కరినీ స్టార్ లెవల్లో ట్రీట్ చేసేవాడని, నటీనటులనే కాకుండా టెక్నీషియన్లను, ఇతర పనివాళ్లను కూడా ఒకే విధంగా చూసుకునేవాడని జగపతిబాబు వెల్లడించారు. అందుకే రామ్ చరణ్ రాగానే సెట్స్ మీద సంతోషం వెల్లివిరిసిందని చెప్పారు.

More Telugu News