Visakhapatnam District: విశాఖ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్... ముగ్గురు మావోయిస్టుల మృతి

  • మన్యం ప్రాంతంలో కాల్పుల మోత
  • భద్రతా బలగాలు, మావోల మధ్య భీకర ఎదురుకాల్పులు
  • గూడెం కొత్తవీధి మండలంలో ఘటన
ఇటీవల కాలంలో  ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోల అలజడి పెద్దగా లేదనుకుంటున్న తరుణంలో విశాఖ జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. గూడెం కొత్తవీధి మండలం మదిమల్లు వద్ద భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు హతమయ్యారు. ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాయి.

భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. వారిలో మావోయిస్టు అగ్రనేత అరుణ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గతేడాది సెప్టెంబరు 23న విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.
Visakhapatnam District
Maoist
Police

More Telugu News