29 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లాడు.. ఇప్పుడు ఏకంగా రూ.130 కోట్ల శ్రీమంతుడయ్యాడు!

21-09-2019 Sat 12:24
  • 20 వేల ఎంఆర్ఎఫ్ షేర్లు కొన్న ఓ వ్యక్తి
  • రోడ్డు ప్రమాదంలో గాయంతో కోమాలోకి 
  • 2017లో మెలకువలోకి వచ్చిన బాధితుడు
  • 29 ఏళ్ల కాలంలో భారీగా పెరిగిన ఎంఆర్ఎఫ్ షేర్ల ధర

కోమా కారణంగా ఓ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 1990లో ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన 20,000 షేర్లను నామమాత్రపు ధరకే కొన్నాడు. అనంతరం కొన్ని రోజులకే ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. అయితే మెరుగైన వైద్య చికిత్సతో 2017లోనే ఆయనకు స్పృహ వచ్చింది.

ఫిజియోథెరపీతో కోలుకున్న అనంతరం ఓ రోజు మనవడు రవితో ‘నేను 1990లో 20 వేల ఎంఆర్ఎఫ్ షేర్లు కొన్నాను. ఆ కాగితాలు ఉన్నాయా?’ అని అడిగాడు. దీంతో తొలుత ఆశ్చర్యపోయిన రవి.. ఇంట్లో వెతకగా అందుకు సంబంధించిన పత్రాలు లభించాయి. ఈ విషయమై ఓ బిజినెస్ ఛానల్ కు ఫోన్ చేసిన రవి.. ఈ షేర్లను నగదు రూపంలోకి ఎలా మార్చుకోవాలని ఆర్థిక, షేర్ మార్కెట్ నిపుణులను ప్రశ్నించాడు.

దీంతో తొలుత డీమ్యాట్ అకౌంట్ తెరవాలని వారు సూచించారు. ఆ తర్వాతే ఈ షేర్లను నగదు రూపంలోకి మార్చుకోగలమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు చెప్పిన జవాబుకు రవికి మతిపోయింది. ప్రస్తుతం ఎంఆర్ఎఫ్ ఒక్కో షేర్ విలువ మార్కెట్ లో రూ.64,900గా ఉందనీ, ఈ లెక్కన రవి దగ్గర ఉన్న 20 వేల షేర్ల విలువ రూ.130 కోట్ల వరకూ ఉంటుందని చెప్పారు. దీంతో రవి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.