ఇంటర్నెట్‌ వినియోగం కూడా వ్యక్తిగత గోప్యత హక్కులో భాగమే: స్పష్టం చేసిన కేరళ హైకోర్టు

20-09-2019 Fri 11:55
  • దీన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలని స్పష్టీకరణ
  • హాస్టల్‌లో సెల్ వాడుతున్నారని హాస్టల్‌ నుంచి విద్యార్థినుల గెంటివేత
  • కోర్టును ఆశ్రయించిన బాధితులు
ఇంటర్నెట్‌ వినియోగం కూడా వ్యక్తిగత గోప్యత హక్కులో భాగమేనని, దీన్ని కూడా ప్రాథమిక హక్కుగానే పరిగణించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పద్దెనిమిదేళ్లు నిండిన వారికి రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత గోప్యత హక్కు కిందికే ఇది కూడా వస్తుందని కీలక తీర్పు వెలువరించింది. కేరళ రాష్ట్రం కోజికోడ్‌ జిల్లా చెలనూరులోని ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌ వాడకూడదని యాజమాన్యం నిషేధం విధించింది.

ఈ నిబంధనను ఉల్లంఘించారని హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న షహీమా శిరిన్‌, మరికొందరు విద్యార్థినులను యాజమాన్యం వసతి గృహం నుంచి పంపించి వేసింది. దీనిపై విద్యార్థినులు కోర్టును ఆశ్రయించారు. ఇంటర్నెట్‌లో తమ కోర్సుకు సంబంధించిన విషయాలను శోధించడానికి ఈ నిబంధన వల్ల ఆటంకం కలుగుతోందని కోర్టుకు తెలిపారు. పైగా కళాశాల యాజమాన్యం బాలుర వసతి గృహం విషయంలో ఇలాంటి నిబంధన ఏదీ అమలు చేయకుండా బాలికల హాస్టల్‌ విషయంలో మాత్రం అమలు చేస్తూ వివక్ష పాటిస్తోందని కోర్టు ముందు తెలిపారు. పిటిషనర్ల వాదనలు విన్న న్యాయమూర్తి ఇంటర్నెట్‌ వినియోగాన్ని ప్రాథమిక హక్కుగా, వ్యక్తిగత గోప్యత హక్కుగా భావించాలని సూచిస్తూ తీర్పు చెప్పారు.