Congress: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు!

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో షాక్
  • వచ్చే నెల 3 వరకూ జ్యుడీషియల్ కస్టడీ
  • ప్రస్తుతం తీహార్ జైలులో వున్న చిదంబరం 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 3 వరకూ పొడిగించింది. జైలు నుంచి బయటపడేందుకు చిదంబరం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఆయన ఈడీకి సరెండర్ అవుతానని పిటిషన్ పెట్టుకోగా, కోర్టు తిరస్కరించింది. తాజాగా ఆయన కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరాన్ని తీహార్ జైలు నుంచి కోర్టుకు తీసుకురాగా, కస్టడీని అక్టోబర్ 3 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

యూపీఏ ప్రభుత్వంలో పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్ డీఐ) వచ్చాయి. అయితే ఇందుకోసం భారీగా ముడుపులు చేతులు మారినట్లు గుర్తించిన సీబీఐ పలు సెక్షన్ల కింద చిదంబరంపై కేసు నమోదుచేసింది. ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, తొలుత సీబీఐ కస్టడీకి అప్పగించిన కోర్టు.. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. ప్రస్తుతం చిదంబరం తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News