Arogya Sri: ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధం విధించిన జగన్ సర్కార్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 వేల వ్యాధులు!

  • సుజాతరావు కమిటీ సిఫారసులకు ఏపీ ప్రభుత్వం ఆమోదముద్ర
  • హైదరాబాద్, బెంగళూరు, చైన్నైల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకూ ఆరోగ్యశ్రీ వర్తింపు
  • డిసెంబర్ 21 నుంచి ఆరోగ్య కార్డులు
ఏపీలో ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్న ప్రభుత్వ వైద్యులపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఇకపై ప్రైవేట్ వైద్యం చేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ చేసిన సిఫారసులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

దాదాపు వందకు పైగా సిఫారసులను సుజాతరావు కమిటీ చేసింది. సిఫారసుల ఆధారంగా రూ. 1000 ఖర్చు దాటే ప్రతి వ్యాధికి ఆరోగ్యశ్రీలో చికిత్స అందించాలని నిర్ణయించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలలోని 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ప్రభుత్వ వైద్యులకు జీతాలు పెంచాలన్న కమిటీ ప్రతిపాదనలకు జగన్ ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆరోగ్యశ్రీ జాబితాలోకి మరిన్ని వ్యాధులను తీసుకొచ్చారు. 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ... జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు. మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయనున్నారు. ఇతర జిల్లాలలో 2020 ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 21 నుంచి ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నారు. ఆపరేషన్లు చేయించుకునేవారు కోలుకునే వరకు నెలకు రూ. 5 వేలు సాయం చేయనున్నారు.
Arogya Sri
Andhra Pradesh
Jagan
Sujatha Rao Committee

More Telugu News