చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దొంగ.. ఒక్క ఉదుటున లేచిన తల్లి.. వీడియో ఇదిగో!
- పంజాబ్ లోని లూథియానాలో ఘటన
- సైకిల్ రిక్షాలో బాలిక కిడ్నాప్ కు ప్రయత్నం
- నిందితుడిని పట్టుకున్న స్థానికులు
లూథియానాలో ఓ చిన్నారి తన అమ్మ, నానమ్మతో కలిసి ఆరు బయట నిద్రపోతుండగా, అదే ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి పాపను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ అలికిడికి బాలిక తల్లి మేల్కొని గట్టిగా అరుస్తూ, రిక్షా లోంచి పాపను తీసుకుంది. దాంతో తన రిక్షాలో అతను పరారయ్యాడు. అయితే స్థానికులు అతడిని కొద్దిదూరంలోనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు పాపను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడో ఇంకా తెలియరాలేదని చెప్పారు. బాధిత కుటుంబం ఫిర్యాదు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సదరు నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే అతడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు.