Ayodhya: అయోధ్య కేసులో కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు

  • మధ్యవర్తిత్వంపై తమకేమీ అభ్యంతరం లేదన్న సుప్రీం
  • పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ కమిటీ ప్రయత్నాలు చేయొచ్చని వెల్లడి
  • కమిటీ సంప్రదింపులకు సమాంతరంగా విచారణ జరుగుతుందని స్పష్టీకరణ

ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య కేసులో గత కొన్నిరోజులుగా సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది.  అయోధ్య అంశంపై 26వ రోజు విచారణ జరగ్గా, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అక్టోబరు 18 లోపు విచారణ పూర్తిచేస్తామని పేర్కొంది. ఈ కేసులో మధ్యవర్తిత్వం కొనసాగించాలని ఇరువర్గాలు భావిస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపింది.

వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ కమిటీ ప్రయత్నాలు చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చింది. సరైన పరిష్కారం లభించిందని భావిస్తే దాన్ని కోర్టు ముందు ప్రతిపాదించవచ్చని కూడా సూచించింది. ఇప్పటివరకు సాగినట్టుగానే, ఇకముందు కూడా మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపులు గోప్యంగా కొనసాగాలని సుప్రీం స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపులకు సమాంతరంగా కోర్టు విచారణ జరుగుతుందని వెల్లడించింది.

అటు, అక్టోబరు 18తో వాదనలు ముగుస్తాయని భావిస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఆశాభావం వ్యక్తం చేశారు. అదే రోజున కోర్టు ఆదేశాలను రిజర్వ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీజేఐ పదవీకాలం నవంబర్ 17తో ముగియనుండడంతో ఈ లోపే అయోధ్య వివాదంపై తీర్పు వెలువడే అవకాశం ఉంది.

More Telugu News