Cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకు పాకిన ఫిక్సింగ్ భూతం.. పోలీసులకు బీసీసీఐ ఫిర్యాదు!

  • ఓ మహిళా క్రికెటర్ ను ఆశ్రయించిన ఇద్దరు బుకీలు
  • మ్యాచ్ ఫిక్స్ చేస్తే భారీగా నగదు ఇస్తామని ఆఫర్
  • బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి క్రికెటర్ ఫిర్యాదు

ఇప్పటివరకూ పురుషుల క్రికెట్ కే పరిమితమైన ఫిక్సింగ్ భూతం తాజాగా మహిళల క్రికెట్ కు పాకింది. ఓ భారత మహిళా క్రికెటర్ ను ఇద్దరు క్రికెట్ బుకీలు సంప్రదించారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడితే భారీగా నగదును ముట్టజెబుతామని ఆశపెట్టారు. అయితే సదరు క్రికెటర్ మాత్రం ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేసింది. గత జనవరి నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఏడాది ఆరంభంలో భారత్-ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య స్వల్ప ఓవర్ల మ్యాచ్ లు భారత్ లో జరిగాయి. ఈ సందర్భంగా రాకేశ్ బఫ్నా, జితేంద్ర కొఠారి అనే ఇద్దరు బుకీలు ఓ మహిళా క్రికెటర్ ను సంప్రదించారు. తాము చెప్పినట్లు మ్యాచ్ గతిని మారిస్తే భారీగా నగదును ఇస్తామని ఆశచూపారు. అయితే ప్రమాదాన్ని గుర్తించిన సదరు క్రికెటర్ అక్కడి నుంచి చల్లగా జారుకుంది.

అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ బెంగళూరు పోలీసులకు ఇద్దరు నిందితులపై ఫిర్యాదు చేసింది. కాగా, ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ షెకావత్ ధ్రువీకరించారు.

More Telugu News