Ongole: ఈ సీజన్ లో తొలిసారి... ఒంగోలులో కుండపోత వర్షం!

  • 44 మిల్లీమీటర్ల వర్షం
  • రెండు గంటలపాటు కురిసిన వాన
  • లోతట్టు ప్రాంతాలు జలమయం

ఈ వర్షాకాలం సీజన్ లో తొలిసారిగా ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం 6 గంటలకు మొదలైన వర్షపు జల్లు, ఆపై ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు రెండు గంటల పాటు కుంభవృష్టిలా మారింది. రహదారులు వాగులను, చెరువులను తలపించాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  

సౌత్ బైపాస్ రోడ్ లోని ప్రగతి కాలని, నార్త్ బైపాస్ లోని వెంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతాలతో పాటు బాలినేని భరత్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, నెహ్రూ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. జిల్లాలోని కందుకూరు, సంతనూతలపాడు, కొత్తపట్నం, టంగుటూరు మండలాల్లో సైతం భారీ వర్షం కురిసింది. అర్థరాత్రి 12 వరకూ వర్షం పడుతూనే ఉంది. జిల్లాలో సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 133 మిల్లీమీటర్లు కాగా, ఒక్క సోమవారమే 44.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్ సీజన్ లో పంటల సాగు మొదలు పెట్టిన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News