Andhra Pradesh: నేను దళితులు, బీసీలతో రాసుకుపూసుకు తిరుగుతున్నానని సొంత కమ్మ కులస్తులే చెప్పారు!: బోడె ప్రసాద్

  • ప్రజలను నిర్లక్ష్యం చేయలేదు
  • అయినా ఓడించారు
  • ఓ యూట్యూబ్ ఛానల్ కు టీడీపీ నేత ఇంటర్వ్యూ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి తానే షాక్ కు గురయ్యాయని టీడీపీ నేత, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. తాను నియోజకవర్గాన్ని ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదనీ, ప్రజల మధ్యే ఉన్నానని చెప్పారు. ‘‘అభివృద్ధి, ప్రజా సంబంధాలు, ప్రజా సేవ, అందుబాటులో ఉండటం గానీ, ఎప్పుడూ నిర్లక్ష్యం చూపలేదు. ఏదైనా సమస్య అని ప్రజలు నాకు ఫోన్ చేస్తే.. ‘నేనే 5 నిమిషాల్లో వస్తున్నా. అక్కడే ఉండండమ్మా’ అని వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా నేనే గెలుస్తానని గట్టి నమ్మకంతో ఉన్నా’’ అని ప్రసాద్ వ్యాఖ్యానించారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పెనమలూరు నియోజకవర్గంలో తాను చిన్నతప్పు కూడా చేయలేదనీ, అలాంటప్పుడు ప్రజలు ఓడించరని అతివిశ్వాసంతో తాను ఉండిపోయానని తెలిపారు. కానీ ఫలితాలు వచ్చాక మాత్రం షాక్ కు గురయ్యానని చెప్పారు. ఫలితాలు వెలువడ్డాక గ్రామాల్లోకి వెళ్లాననీ..‘మీరు నాకు ఓటేసి ఉంటే ధన్యావాదాలు. ఓటేయకపోతే నేనేమన్నా తప్పుచేశానా? ఎక్కడ తప్పు జరిగింది? అని అడిగాను’ అని బోడె ప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఎలాంటి నేరం చేయని వ్యక్తికి శిక్ష వేస్తే ఎంత బాధపడతారో, తాను ఇప్పుడు అలాంటి బాధనే అనుభవిస్తున్నానని బోడె ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా తన వింత అనుభవాన్ని బోడె ప్రసాద్ పంచుకున్నారు. తనకు కులాలవారీగా పట్టింపులు లేవని స్పష్టం చేశారు. తాను దళితులు, బీసీలతో రాసుకుపూసుకు తిరుగుతున్నానని సొంత కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు వ్యక్తులు చెప్పారని గుర్తుచేసుకున్నారు. అయితే తనకు ఎలాంటి కుల పట్టింపులు లేవనీ, తనతో కలిసి వచ్చే వ్యక్తులను కలుపుకునిపోతానని తేల్చిచెప్పారు. తాను దేవుడినే నమ్మననీ, అలాంటప్పుడు తనకు కులాల పట్టింపులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.

More Telugu News