Pawan Kalyan: వైసీపీ నాయకులు విస్కీని ప్రొటీన్ షేక్ గా, బ్రాందీని బోర్నవిటాగా ముందుకు తీసుకెళ్తారనిపిస్తోంది: పవన్ కల్యాణ్

  • మరుగుదొడ్లు లేక అమ్మాయిలు స్కూళ్లకు వెళ్లడం మానేస్తున్నారు
  • బీర్ల అమ్మకాలు పెరిగాయనే వార్తలొస్తున్నాయి
  • సంపూర్ణ మద్య నిషేధంపై నాకు అనుమానాలు ఉన్నాయి

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఎంతో మంది అమ్మాయిలు పాఠశాలలకు వెళ్లకుండా మానేస్తున్నారని... అక్కడ టాయిలెట్లు లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. మరుగుదొడ్లను నిర్మించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు కూడా బిడ్డలు ఉన్నారని... ఇతర అమ్మాయిల విషయంలో అంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. అమ్మఒడి పథకం కింద రూ. 15 వేలు ఇస్తామని చెబుతున్నారని... ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నా, ఒకరికే ఇస్తామంటున్నారని... రెండో బిడ్డ ఎలా చదువుకోవాలని అడిగారు.

మద్యపానంపై వచ్చే ఆదాయం అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు చెప్పారని... కానీ, రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయనే వార్తలు వస్తున్నాయని పవన్ చెప్పారు. గతంలో టీడీపీ నేత ఒకరు బీర్ ను హెల్త్ డ్రింక్ అన్నారని... కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు విస్కీని ప్రొటీన్ షేక్ గా, బ్రాందీని బోర్నవిటాగా ముందుకు తీసుకెళతారని తనకు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మద్యం మీద ఆదాయం లేదని చెబుతూనే, వస్తున్న ఆదాయాన్ని దాచేస్తున్నారని... వైసీపీ చెబుతున్న సంపూర్ణ మద్యనిషేధంపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

More Telugu News