Pawan Kalyan: 35 దేశాల రాయబారులను పిలిపించి ఏం సాధించారు?: జగన్ ప్రభుత్వానికి పవన్ సూటి ప్రశ్న

  • ఇసుక మాఫియాను అరికట్టడంలో విఫలమయ్యారు
  • కియా పరిశ్రమ సీఈవోను అవమానించారు
  • ఇలాగైతే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా?

టీడీపీ ప్రభుత్వం కూలిపోవడానికి ఇసుక మాఫియా ఒక ప్రధాన కారణమని... ఇసుక మాఫియాను అరికట్టడంలో వైసీపీ  ప్రభుత్వం కూడా విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. టన్ను ఇసుక రూ. 375 అని చెప్పి రూ. 500 వసూలు చేస్తున్నారని తెలిపారు.

ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనలో నూతన ఇసుక పాలసీని తీసుకురాలేకపోయారని అన్నారు. వైసీపీ జనరంజక మేనిఫెస్టోను అమలు చేయాలంటే రూ. 50 వేల కోట్లు కావాలని... కానీ, ఇప్పటికే రాష్ట్రం రూ. 2.59 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పారు. వైసీపీ 100 రోజుల పాలనపై నివేదికను పవన్ కల్యాణ్ నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీపై విమర్శలు గుప్పించారు.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసి, గందరగోళం సృష్టించారని పవన్ మండిపడ్డారు. కియా పరిశ్రమ సీఈవోను కూడా అవమానించారని చెప్పారు. పరిపాలన ఈ విధంగా కొనసాగితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. పెట్టుబడిదారులను ఎవరైనా బెదిరిస్తారా? అని అడిగారు. 35 దేశాల రాయబారులను పిలిపించి నిర్వహించిన ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా ఏం సాధించారని ఎద్దేవా చేశారు.

More Telugu News