కాంగ్రెస్ నేత చిదంబరానికి మళ్లీ షాక్.. సరెండర్ పిటిషన్ ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు!

  • ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న చిద్దూ
  • ఈడీకి సరెండర్ అవుతానంటూ పిటిషన్
  • ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు ఈరోజు షాక్ ఇచ్చింది. తాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు సరెండర్ అవుతానన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. చిదంబరానికి ఇంటి భోజనం ఇవ్వాలన్న ఆయన లాయర్  విజ్ఞప్తిని నిన్న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. జైలులో అందరూ సమానమేనని కోర్టు అప్పుడు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తనను తీహార్ జైలు నుంచి ఈడీ కస్టడీకి అప్పగించాలనీ, తాను సరెండర్ అవుతానని చిదంబరం ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు.

చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్ఎక్స్ మీడియాకు రూ.305 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే ఈ సందర్భంగా చిదంబరం నిబంధనలను ఉల్లంఘించి మరీ అనుమతులు ఇప్పించారనీ, ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నారని సీబీఐ కేసు నమోదుచేసింది. సీబీఐ చార్జిషీట్ ఆధారంగా ఈడీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం ఆయనకు జ్యూడీషియల్ కస్టడి విధించింది. దీంతో పోలీసులు చిదంబరాన్ని ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.

More Telugu News