GERMANY: ఒక్క కప్పు కాఫీ కారణంగా.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విమానం!

  • జర్మనీ నుంచి మెక్సికోకు బయలుదేరిన ఎయిర్ బస్
  • కాఫీ పడటంతో కాక్ పిట్ లో పొగలు, వాసన
  • ఐర్లాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

సాధారణంగా పక్షులు ఇంజిన్లను ఢీకొడితే, మరేదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అవుతుంటాయి. మరికొన్నిసార్లు ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా విమానాలు సమీపంలోని ఎయిర్ పోర్టులో దిగిపోతాయి. కానీ ఓ కప్పు నిండా కాఫీ కారణంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ విచిత్ర ఘటన జరిగినప్పటికీ, ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఈ నివేదికను తాజాగా విడుదల చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్ బస్ ఏ330-243 విమానం 326 మంది ప్రయాణికులతో జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నుంచి మెక్సికోలోని కాన్కున్ కు బయలుదేరింది. ఈ సందర్భంగా కాక్ పిట్ లోకి కాఫీ తీసుకొచ్చిన పైలెట్ కొంచెం తాగి తన పక్కన పెట్టాడు. అయితే గాలి కుదుపుల కారణంగా ఈ కాఫీ కప్పు కాక్ పిట్ లో పడిపోయింది. దీంతో అక్కడి సర్క్యూట్లలోకి కాఫీ చేరడంతో పొగ, కాలిన వాసన వచ్చాయి.

వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని ఐర్లాండ్ లోని షానన్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయటపడటంతో ఎయిర్ లైన్స్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటన అనంతరం కాక్ పిట్ లో పాటించాల్సిన కొత్త విధివిధానాలను సవరించినట్లు ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ రూపొందించింది.

More Telugu News