Ijaz Ahmed Shah: పాకిస్థాన్ ఇమేజ్ ను నాశనం చేశారు.. మనల్ని ఎవరూ నమ్మడం లేదు: పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

  • భారత్ చెప్పే మాటలనే అంతర్జాతీయ సమాజం నమ్ముతోంది
  • కశ్మీర్ విషయంలో మనం చెబుతున్న మాటలను ఎవరూ వినడం లేదు
  • పాక్ బాధ్యతాయుత దేశం కాదని భావిస్తున్నారు
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ఇంటా, బయటా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో, ఆయన ఇబ్బందిని మరింత పెంచేలా ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి బ్రిగేడియర్ (రిటైర్డ్) ఇజాజ్ అహ్మద్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ చెబుతున్న మాటలను అంతర్జాతీయ సమాజం విశ్వసించడం లేదని ఆయన అన్నారు. కేవలం భారత్ చెబుతున్న విషయాలనే నమ్ముతోందని కుండబద్దలు కొట్టారు. దేశాన్ని పాలించిన వారు పాక్ ఇమేజ్ ను దెబ్బతీశారని విమర్శించారు. ఓ పాకిస్థాన్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయంగా ప్రజలెవరూ పాక్ ను నమ్మడం లేదని ఇజాజ్ చెప్పారు. 'కశ్మీర్ లో కర్ఫ్యూ విధించారు, అక్కడి ప్రజలను కొడుతున్నారు, ప్రజలకు తిండి లేదు, మందులు లేవు అని మనం చెబుతున్నా ఎవరూ వినడం లేదు. భారత్ చెప్పే మాటలనే అందరూ వింటున్నారు. పాకిస్థాన్ ఒక బాధ్యతాయుతమైన దేశం కాదని అందరూ నమ్ముతున్నారు. మన ప్రతిష్టను మనం కోల్పోయాం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని పాలించిన వారిలో ఏ ఒక్కరినో ఉద్దేశించి తాను మాట్లాడటం లేదని... ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని అన్నారు. పాకిస్థాన్ ఇప్పుడు తన ఆత్మను వెతుక్కోవాల్సన పరిస్థితి దాపురించిందని అన్నారు.
Ijaz Ahmed Shah
Pakistan
Imran Khan
Kashmir
India

More Telugu News