Vijay Devarakonda: యురేనియం తవ్వకాలపై మండిపడ్డ హీరో విజయ్ దేవరకొండ

  • ఇప్పటికే చెరువులను నాశనం చేసుకున్నాం
  • పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కూడా లేదు
  • ఇప్పుడు నల్లమలను నాశనం చేయాలనుకుంటున్నారు

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై సినీ హీరో విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే చెరువులను నాశనం చేసుకున్నామని, తాగునీటి వనరులను కలుషితం చేసుకున్నామని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. పర్యావరణానికి హాని చేయడం ద్వారా... కొన్ని రాష్ట్రాల్లో వరదలు, మరికొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు తాండవించేలా చేజేతులా చేసుకున్నామని చెప్పాడు. ప్రతి ప్రాంతంలో గాలి నాణ్యత ఘోరంగా ఉంటోందని అన్నాడు. దేశంలోని ఎన్నో నగరాలు నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయని... తాగడానికి, బ్రష్ చేసుకోవడానికి, స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి ఇలా దేనికీ సరిపడా నీరు ఉండటం లేదని వాపోయాడు.

ప్రకృతిని ఇప్పటికే ఎంతో నాశనం చేశామని... వినాశనాన్ని ఇలాగే కొనసాగిద్దామా? అని విజయ్ ప్రశ్నించాడు. పచ్చదనంతో కళకళలాడుతున్న నల్లమల అడవులు ఇప్పుడు నాశనమయ్యే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశాడు. యురేనియం కావాలంటే కొనుక్కోవచ్చని... అడవులను కొనగలమా? అని ప్రశ్నించాడు. యరేనియంను కొనలేని పరిస్థితి ఉంటే... సోలార్ ఎనర్జీపై దృష్టి పెట్టాలని సూచించాడు. ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయండని చెప్పాడు.

యురేనియం తవ్వకాలను సమర్థిస్తున్న వారిని తాను ఒకటే అడుగుతున్నానని... పీల్చడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి పరిశుభ్రమైన నీరు లేనప్పుడు ఈ యురేనియం, దాని ద్వారా ఉత్పత్తి చేసుకునే ఈ కరెంట్ తో ఏం చేసుకుంటామని ప్రశ్నించాడు. నల్లమల అడవులను కాపాడుకుందామని పిలుపునిచ్చాడు.

More Telugu News