India: కశ్మీర్ లో రక్తపాతం సృష్టించాలంటూ ఉగ్రవాదులకు పాక్ రహస్య కోడ్ సందేశాలు.. గుర్తించిన భారత్!

  • ఎల్వోసీ వెంట ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటు 
  • క్వామీ తరానా రూపంలో రహస్య సందేశాలు
  • పుకార్లను వ్యాప్తి చేయాలని ఉగ్రమూకలకు సూచన

భారత్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేని పాకిస్థాన్ దొంగ దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగా కశ్మీర్ లో నక్కిన ఉగ్రవాదులకు హింసను రెచ్చగొట్టాలని రహస్య సందేశాలు పంపుతోంది. ఇందుకోసం పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో కేంద్రాలను ఏర్పాటు చేసింది. భారత్ గత నెల 5న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దుచేసిన సంగతి తెలిసిందే.

ఇది జరిగిన వారం రోజుల్లోనే కశ్మీర్ లో హింసను రెచ్చగొట్టే కుట్రకు పాక్ తెరలేపింది. పాక్ జాతీయ గీతమైన ‘క్వామీ తరానా’ ద్వారా నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్రసంస్థల అధినేతలు తమ అనుచరులు, హ్యాండ్లర్లకు రహస్య సందేశాలను కోడ్  ద్వారా పంపుతున్నారని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఇందుకోసం ఎఫ్ఎం స్టేషన్లతో పాటు హై ఫ్రీక్వెన్సీ రేడియో కేంద్రాలను పాక్ సరిహద్దుకు తరలిస్తోందని భారత నిఘా సంస్థలు తెలిపాయి.

ఈ సందేశాలను తాము డీకోడ్ చేశామని వెల్లడించాయి. అందులో ‘కశ్మీర్ లో అలజడి సృష్టించండి. అందుకోసం అవసరమైతే పుకార్లు వ్యాప్తి చేయండి’ అని పాక్ నుంచి ఉగ్రమూకలకు సందేశాలు అందుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటుకు పాక్ ఆర్మీలోని సిగ్నల్ కోర్ పనిచేస్తోందని నిఘా సంస్థలు చెప్పాయి.

More Telugu News