Nellore District: భక్తులతో కిటకిటలాడుతున్న నెల్లూరు స్వర్ణాల చెరువు... వైభవంగా గంధ మహోత్సవం!

  • నెల్లూరులో ఘనంగా రొట్టెల పండగ
  • అమరవీరులకు గంధం సమర్పించిన పెద్దలు
  • పలు రకాల రొట్టెలను మార్చుకుంటున్న భక్తులు

నెల్లూరు బారా షాహీద్ దర్గాలో నిన్న మొదలైన రొట్టెల పండగ అత్యంత వైభవంగా సాగుతోంది. దర్గాను ఆనుకుని ఉండే స్వర్ణాల చెరువులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు, ఇతర భక్తులతో రొట్టెలను మార్చుకుంటున్నారు. తాము కోరుకున్న మొక్కులు తీరిన తరువాత భక్తులు ఇక్కడికి వచ్చి, అవే కోరికలు కోరుకునే భక్తులతో రొట్టెలను పంచుకుంటారన్న సంగతి తెలిసిందే.

ఇక రొట్టెల పండగలో అత్యంత ముఖ్యమైన గంధ మహోత్సవం ఈ ఉదయం వైభవంగా జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి గంధాన్ని తెచ్చిన ముస్లిం పెద్దలు, దాన్ని అమరవీరులకు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని కడప పీఠాధిపతి అరిపుల్లా హుస్సేని స్వయంగా పర్యవేక్షించారు. అమరులకు సమర్పించిన గంధాన్ని దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.

కాగా, ఈ సంవత్సరం సంతానం, వివాహం, ఉద్యోగం రొట్టెలకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. దీంతో పాటు వీసా, విదేశీ ప్రయాణం, ఉన్నత చదువుల రొట్టెలనూ భక్తులు మార్చుకుంటున్నారు.

More Telugu News