Andhra Pradesh: పోలీసులకు భయపడి మేం పోరాటాలు ఆపబోం!: కేశినేని నాని

  • ఏపీలో ఛలో ఆత్మకూరు రగడ
  • ప్రజా పోరాటాలు కొనసాగిస్తామన్న కేశినేని నాని
  • ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాపాడాలని హితవు

తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నానిని సైతం అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడలోని ఓ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై కేశినేని తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ పోలీసులకు భయపడి తాము పోరాటాలు ఆపబోమని కేశినేని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయడం సమస్యకు ఎంతమాత్రం పరిష్కారం కాదని స్పష్టం చేశారు. పల్నాడులో పోలీసులు వివక్షాపూరితంగా, ఏకపక్షంగా వ్యవహరించడమే ఈ సమస్యకు మూల కారణమని కేశినేని నాని తెలిపారు. అందులో భాగంగా టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదుచేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాపాడాలనీ, అది ప్రభుత్వ బాధ్యతని కేశినేని నాని చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కేశినేని నాని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ట్యాగ్ చేశారు.

More Telugu News