Ambati Rayudu: 12 గంటలు కాదు... 12 రోజులు తినకుండా కూర్చున్నా ఏమీ చేయలేవు: అంబటి రాంబాబు

  • ఒక్కొక్కరికి రూ. 10 వేలు ఇచ్చి శిబిరాల్లో ఉంచారు
  • జగన్ ను ఎయిర్ పోర్టులో అడ్డుకున్నప్పుడు తెలియదా?
  • మండిపడ్డ అంబటి రాంబాబు

తాను నేడు 12 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నానని ప్రకటించిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు 12 రోజుల పాటు తినకుండా కూర్చున్నా ఏమీ చేయలేరని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రభుత్వంపై బురదజల్లాలన్న ఏకైక కారణంతో, ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు కాబట్టే, తాము కూడా పోటీగా అదే కార్యక్రమాన్ని చేపట్టామని అంబటి వ్యాఖ్యానించారు. టీడీపీ బాధితులుగా ఉన్న వారి గోడును ప్రజలకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమమని అన్నారు.

ఒక్కొక్కరికి రూ. 10 వేలు ఇచ్చి శిబిరాల్లో తెచ్చి పెట్టారని ఆరోపించిన ఆయన, అటువంటి వారిని పెయిడ్ ఆర్టిస్టులనక ఇంకేమనాలని ప్రశ్నించారు. ఎవరైనా బాధితులు ఉంటే, వారికి రక్షణ కల్పిస్తామని పోలీసులు స్పష్టంగా చెబుతుంటే, తానే రక్షణ కల్పిస్తానని చంద్రబాబు అనడం ఏంటని మండిపడ్డారు. కుక్క పని కుక్కే చేయాలని, గాడిద చేయాలనుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని అన్నారు.

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను అడ్డుకుని, రన్ వే పై నుంచే వెనక్కు పంపిన విషయాన్ని చంద్రబాబు మరిచిపోయినట్టున్నారని అంబటి ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ఆరుగురిని చంపారంటున్న చంద్రబాబు, గతాన్ని గుర్తు చేసుకోవాలని, టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక్కరోజులో ఏడుగురు వైసీపీ కార్యకర్తలను హత్య చేశారని అన్నారు. ఇటీవలి హత్య కేసుల్లో ఏ వైసీపీ కార్యకర్తకూ ప్రమేయం లేదని, పాత పగలతో జరిగిన హత్యలకు రాజకీయ కారణాలను టీడీపీ పులుముతోందని అంబటి ఆరోపించారు.

More Telugu News