Tamil Nadu: ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు.. హడలిపోయిన ప్రయాణికులు

  • జాఫర్‌ఖాన్‌పేట రైల్వే స్టేషన్‌లో ఘటన
  • ముందు రైలుకు వంద మీటర్ల దూరంలో ఆగిన రైలు
  • తమకు ముందే తెలుసన్న రైల్వే అధికారులు

ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చిన ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో జరిగింది. మంగళవారం ఉదయం 6:30 గంటలకు జోలార్‌పేట నుంచి అరక్కోణానికి రైలు బయలుదేరింది. 8:30 గంటల సమయంలో కాట్పాడి సమీపంలోని జాఫర్‌ఖాన్‌పేటకు రైలు చేరుకున్న తర్వాత సిగ్నల్ ఇవ్వకపోవడంతో రైలును నిలిపివేశారు. అదే సమయంలో అదే  ట్రాక్ పైనుంచి జోలార్‌పేట నుంచి తాగునీటితో వస్తున్న రైలు 9 గంటలకు జాఫర్‌ఖాన్‌పేటకు చేరుకుంది. అయితే, అదే ట్రాక్‌పై ముందు మరో రైలు ఉండడాన్ని గుర్తించిన లోకోపైలట్ అప్రమత్తమై వెంటనే సడన్ బ్రేకులు వేశాడు. దీంతో ముందు ఆగివున్న రైలుకు కేవలం వంద మీటర్ల దూరంలో రైలు ఆగింది.

లోకోపైలట్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై కాట్పాడి రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ విషయం తమకు తెలుసన్నారు. రెండు రైళ్లు ఎదురెదురుగా రాలేదని, తొలి రైలు జాఫర్‌ఖాన్‌పేటలో సిగ్నల్ కోసం ఎదురుచూస్తుండగా, తాగునీటితో బయలుదేరిన రెండో రైలును ఆ రైలుకు వంద మీటర్ల దూరంలో నిలిపివేసినట్టు తెలిపారు. అయితే, కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేయడంతో కొందరు ప్రయాణికులు భయపడి రైలు దిగి నడుచుకుంటూ వెళ్లారని ఆయన వివరించారు.

More Telugu News