Virat Kohli: కోహ్లీ-రోహిత్ వివాదంపై మొదటిసారి స్పందించిన రవిశాస్త్రి!

  • వరల్డ్ కప్ అనంతరం ఇద్దరి మధ్య గొడవలు అంటూ కథనాలు
  • వివరణ ఇచ్చిన రవిశాస్త్రి
  • అభిప్రాయ భేదాలను వివాదం అనుకుంటే ఎలా? అంటూ వ్యాఖ్యలు

ఇటీవలే ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచకప్ లో టీమిండియా ఆటతీరు కంటే అనూహ్యరీతిలో కొన్ని వివాదాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటిలో ఒకటి కోహ్లీ-రోహిత్ మధ్య వివాదం! వాస్తవానికి ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ మధ్య సత్సంబంధాలు లేవని ఎప్పుడూ చెప్పలేదు. అయితే, వరల్డ్ కప్ ముగియగానే కోహ్లీ, అనుష్కలను రోహిత్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం సందేహాలకు ఊతమిచ్చింది. దీనిపై తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఓ విషయంలో భేదాభిప్రాయం ఉన్నంత మాత్రాన అది వివాదం అనుకుంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.

"ఓ జట్టులో 15 మంది ఉంటే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం కలిగివుండే అవకాశం ఉంది. అది అవసరం కూడా. అందరూ ఒకే అభిప్రాయం వెల్లడించాలని నేను కోరుకోను. ఓ అంశంపై చర్చ జరిగినప్పుడు జట్టులో ఎవరో ఒకరు సరికొత్త వ్యూహం వెల్లడిస్తే, దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాం. ఒక్కోసారి జట్టులోకి అప్పుడే కొత్తగా వచ్చిన ఆటగాడు ఏదైనా ప్లాన్ చెబితే దాని గురించి కూడా చర్చిస్తాం. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పేలా ప్రోత్సహించి, ఏది అత్యుత్తమమో దాన్ని ఖరారు చేస్తాం. అంతేతప్ప, అభిప్రాయ భేదాలను వివాదాలుగా చూడకూడదు" అంటూ వివరణ ఇచ్చారు.

More Telugu News