హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ తో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ భేటీ

09-09-2019 Mon 14:54
  • జనసేన కార్యాలయానికి వచ్చిన వీహెచ్
  • నల్లమలలో యురేనియం తవ్వకాలపై పవన్ తో చర్చలు
  • అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించిన జనసేనాని

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ రాజకీయ దిగ్గజం వి.హనుమంతరావు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కలిశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన వీహెచ్ జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయదలిచిన నేపథ్యంలో వీహెచ్, జనసేనాని పవన్ తో చర్చించారు. అనంతరం ఇరువురూ మీడియా సమావేశంలో మాట్లాడారు.

తొలుత పవన్ మాట్లాడుతూ, నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు పర్యావరణాన్ని, చెంచుల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పులుల సంరక్షణకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని, రెండుమూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాల పర్యవసానాలపై మేధావుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకుంటామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.