Andhra Pradesh: పల్నాడులో కుటుంబ సభ్యులు చనిపోయినా టీడీపీ శ్రేణులు ఊర్లలో అడుగుపెట్టలేకపోతున్నారు!: భూమా అఖిలప్రియ

  • 100 రోజుల పాలన హత్యలు, రౌడీయిజంతో సాగింది
  • జగన్ పాలన రాక్షసులను తలపిస్తోంది
  • గుంటూరులో వైసీపీ బాధితులను పరామర్శించిన నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పాలన రాక్షస పాలనను తలపిస్తోందని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వపు 100 రోజుల పాలన హత్యలు, రౌడీయిజం, దౌర్జన్యాలతో సాగిందని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ప్రతీకారం, కక్షసాధింపు కోసమే అధికారంలోకి వచ్చినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో ఈరోజు టీడీపీ నేతలతో కలిసి వైసీపీ బాధితుల శిబిరాన్ని భూమా అఖిలప్రియ సందర్శించారు.

ఈ సందర్భంగా బాధితులను పరామర్శించిన అఖిలప్రియ, ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. పునరావాస శిబిరాల్లో బాధితుల మాటలు తీవ్ర ఆవేదనను కల్గిస్తున్నాయని అఖిలప్రియ తెలిపారు. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారుల సొంత కుటుంబ సభ్యులు చనిపోయినా, ఊర్లలోకి వెళ్లలేని పరిస్థితి పల్నాడులో నెలకొందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిష్పాక్షపాతంగా వ్యవహరించాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు.  చేసిన పొరపాటును సరిదిద్దుకోకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారని అఖిలప్రియ హెచ్చరించారు.
Andhra Pradesh
Guntur District
Telugudesam
YSRCP
Bhuma akhilapriya

More Telugu News